ఏ విషయం లేకుండా ఉత్తిగా ఎలా రాస్తారు
రాయడానికి ముఖ్యం కలం-కాగితం కాదు,కంప్యూటర్,లాప్ టాప్,టాబ్లెట్,మొబైల్
అసలే కాదు.మనసులో భావాలు,వ్యక్తీకరణ చేసే విధానం ముఖ్యం. కానీ “రాసేవాడికి చదివేవాడు లోకువ”అనే సామెత ఉండనే వుందిగా.ఆ సామెత పట్టుకొని ఆ వంకతో రాసేవాడికి విషయం ఏమీ లేకపోయినా అదే విషయంగా రాసేస్తాడు చెడామడా.అలాంటి రచయిత మీలో తన్నుకొస్తుంటే మాత్రం ఆపొద్దు.
ఏ విషయం లేకుండా ఉత్తిగా ఎలా రాస్తారు ఎవరైనా,కధకుడికి ఏదైనా రాయటానికి “విషయం,విషయ వస్తువు ప్రధానం” అని చెపుతారు.ఏమిటో ఇది తెలిసికూడా ఏవిషయం లేకుండా రాయాలనే ప్రయత్నం సాహసంతో కూడుకున్నదే మరి!నేను మాత్రం అలా కాదండి విషయంలేకుండా ఒక్క ముక్కకూడా ముందుకు వెళ్ళదు నా చేయి.
అన్నట్టు మీకో విషయం చెప్పాలి,నేను మొదలు పెట్టింది అందుకే మరి మేము పదవ తరగతి చదివేటప్పుడు హిందీ భాష ఒక తప్పనిసరి సబ్జెక్ట్!
మనమేమో పదహారణాలా- కాదు నూటికి నూరుపైసల తెలుగువాళ్ళం.అందునా కోస్తా ప్రాంతం అవడం మూలాన ఒక్క హిందీ ముక్క వస్తే ఒట్టు.కోస్తా కోస్తా ప్రాంతం అంటాం కానీ మేం ఎవరినీ కోయమండీబాబు.ఏదోమాటలు కోస్తాం ఎప్పుడైనా, కొద్దిగా కోతలు కోస్తాం చేలో-పంట పొలాలు, చేలూ, వ్యవసాయం ఎక్కువ కదండీ మాకు,చేలో కోతలు మాకోస్తా వాళ్లకు అలవాటు;ఎప్పుడూ కోతల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, కోస్తాం కోస్తాం అంటాం కోస్తావాళ్ళం!
పైపెచ్చు కొద్దిగా చురుకుదనం కూడా ఎక్కువ-ఎండలు మండుతూ ఉంటాయి కాబట్టి (అసలు నిజ్జం చెప్పేస్తున్నానండీ. సూర్యుణ్ణి హైద్రాబాదుకి మేమే పంపిస్తామండీ, ముందుగా మాదగ్గరకి రాగానే) మా చురుకుదనం ఉగ్గబట్టలేక అందరూ దాన్ని“పొగరు” అనే పదంతో మమ్మల్ని ఉట్టిపుణ్యానికి ఆడిపోసుకుంటూ వుంటారు-మేమైతే అవి ఖాతరు చేయమనుకోండి (కోస్తావాణ్ని కాబట్టి కొద్దిగా స్వగతంలో గొప్ప చెప్పుకుంటున్నా నాకు నేనే- ఇంగ్లీష్ వాడు అంటాడు కదండీ- “బ్లో యువర్ ఓన్ ట్రంపెట్” అని అలాగన్నమాట- “ట్రంప్”కూడా అదే పని చేస్తున్నాడుగా నాలుగేళ్ల నుంచి)
అసలు విషయానికి వస్తా;ఏమిటో గోదావరి కాలవగట్లలాగా నా బుర్రా,రాతా అటూ ఇటూ వెళ్తూ ఉంటాయి.అదో “బలహీనత” అని ఈ మధ్య ఓ డాక్టర్ కూడా చెప్పాడు, పైగా ఈ జబ్బు తగ్గేదికాదు అని ఏ మందులకు లొంగదు అని కూడా “చేయి నొక్కల్లా” చేతిలో చేయివేసి చెప్పాడు-జీవించేయాలి అలాగే మరి. అన్నీ మనచేతిలో ఉంటాయి అనుకుంటాం కానీ- అబద్ధం, అన్నీ తలరాత ప్రకారమే జరిగిపోతాయి!
హిందీ జవాబు పత్రం చదువుకుంటూ పోయిన హిందీ మాష్టారికి అందులో విషయం ఏమీ కనపడలా, అర్ధం అవ్వటం అటుపక్క నుంచితే.వింత ఏవిటంటే ఒక్క ముక్క అర్ధం అవ్వకపోయినా (అర్ధం ఎందుకు అయ్యి చస్తుంది-ప్రశ్నపత్రాన్ని యధా తధంగా దించేస్తే ప్రశ్నగుర్తులు తీసేసి) అన్నిపుటలు రాశానంటే అందునా విషయం లేకుండా -హిందీవాణ్ని కూడాకాదు తెలుగు వాణ్ని-తమాషానా మరి నాతో!) చచ్చినట్టు పాస్ చేసాడు,అంత హిందీ నే రాయడం చూసి పైపెచ్చు ముచ్చటపడ్డాడు!
ఇంతకీ నే చెప్పేది ఏమిటంటే విషయం లేకపోయినా రాసేయచ్చు,పాస్ అవొచ్చు బతుకుల్లో బతికేయచ్చు.నే రాయట్లా, బతికేయట్లా ఇప్పుడు కూడా ఇలా రాస్తూ!!!